మా ఇంట్లో మర్డర్లు

సాధారణం

ఎవరూ నమ్మని నిజమేంటంటే మా యింట్లోనూ వయలెన్సుంది!

నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుండి కళ్ళద్దాల్లోంచి పెద్ద పెద్ద కళ్ళతో ఏమీ తెలియనట్టు చూస్తుండే మా ఆయన-
రోజుకి సగటున రెండు హత్యలు చేస్తారు. నిజ్జంగా నిజం!
ఎవరినంటారా?
పాటలని! కనీసం రోజుకి రెండు మూడు పాటలని భాషా భేదం లేకుండా నిర్దాక్షిణ్యంగా హత మార్చనిదే వారికి సాంబారన్నం గొంతు దిగదు.
ఎలాగంటారా?
అక్కడికే వస్తున్నా-

అసలు పాటంటే ఏమిటి, ఎందుకు అన్న విషయంలోనే మా ఇద్దరికీ అభిప్రాయభేదాలున్నాయని తెలిసేసరికే చాలా ఆలస్యం జరిగిపోయింది!.

నా అభిప్రాయాలిప్పుడెందుగ్గానీ- ఆయన అభిప్రాయం తెలుసుకుందాం.

పాటలో ఏముండాలి? ఒక రాగం, ఒక తాళం, అంతే!
ఈ “మాటలూ, భాషా, భావమూ” ఇవన్నీ ఉత్త దండగనిపిస్తుంది తనకి.

నేను ఫ్లూటు వాయించేటప్పుడు నీకేమైనా మాటలు తెలుస్తున్నాయా? లేదుగా? అయినా పాట బాగుందిగా? అయినప్పుడు ఇక మాటల ఇంపార్టెన్స్ ఏమిటి? ఊరికే లలలా-తననా– అని పాడితే బాగుండదు కాబట్టి ఏవో ఒక మాటలు పెడతాం.” అని అడ్డంగా వాదించే రకం.

ఇంకా రెట్టిస్తే, “ఇంగ్లీషు పాటలు చూడు- తాళం సరిపోకపోతే, “యా”, “బేబీ” అనే రెండు మాటలు పెట్టి లాగించేస్తారు. అలా మనం లయనీ, స్వరాలనీ చూసుకోవాలిగానీ, మాటలు వెతుక్కుంటూ కూర్చుంటే ఒక్క పాట కూడా పాడలేం!” అంటారు.

——————
పెళ్ళైన కొత్తలో, పొద్దున్నే సాధనకి కూర్చుని హాయిగా “మరుగేలరా ఓ రాఘవా” వాయిస్తున్నారు. ఉన్నట్టుండి పంటి కింద రాయి-
“మరుగేల చరా చర రూప ప—-”   అని ఎక్కడికో వెళ్ళిపోయారు. మళ్ళీ వెనకొచ్చి
“రాత్పర సూర్య సుధాకర లోచనా..”

హే భగావాన్, ఏమిటీ పరీక్ష?

ఆపితే “చరా చర రూప” దగ్గర ఆపి, మళ్ళీ “పరాత్పర సూర్య సుధాకర లోచన” దగ్గెరెత్తుకో!
లేదా “చరా చర రూప పరాత్పర” అని అక్కణ్ణించి షైర్లు కొట్టి,
“సూర్య సుధాకర” దగ్గరికి రా. అంతే కానీ, ఈ
“మరుగేల చరా చర రూప పా………” ఏమిటని కాళ్ళ మీద పడ్డంత పని చేసాను.
“నీదంతా చాదస్తం” అని కొట్టి పడేసారు.

———-
“అవునూ! తెలుగులో పిశాచి అంటే అర్ధం ఏమిటోయ్?” ఒకసారడిగారు. మాతృభాష తమిళం కాబట్టి అప్పట్లో తెలుగంత బాగా వచ్చేది కాదు.
“సేం ఎజ్ ఇన్ తమిళ్”, సింపుల్ గా చెప్పాను.
“మరీ ఈ పాట ఏమిటో విచిత్రంగా వుందే”, – స్వగతం.
“పిచ్చి వాడా! తెలుగు పాటలకి అర్ధాలు వెతుకుతున్నావా? హెంత అమాయకుడివయ్యా!” వేదాంతిలా నవ్వాను.
“అంతే నంటావా?”
“అంతే- అంతే! అదొదిలేసి ఈ బట్టల పని కానీ.”
రెండురోజుల తర్వాత, ఏదో వస్తువుకోసం వెతుకుతున్న మనిషి పరధ్యానంగా పాట పాడుతున్నాడు,
“నేనొక ప్రేమ పిశాచినీ-లా-ల-ల-లా-ల”.
ఉలిక్కిపడ్డాను.
“అదేం పాట?” వొణుకుతున్న గొంతుతో అడిగాను.
“నిన్న రేడియోలో విన్నాను. అందుకే నిన్ను పిశాచి అంటే అర్ధం అడిగాను.”
“అది పిశాచి కాదు! పిపాసి!”
‘అలాగా? ఈ సంగతి నిన్నే చెప్తే అయిపోయేది గా!” విసుక్కుని మళ్ళీ వెతకడం-పాడడంలో పడిపోయాడు.

*****

“ఏలాగు ధరియింతునే”, ఆఫీసు నించి వస్తూనే లాప్ టాప్ బేగు పక్కన పడేసి పాడుతున్నారు.
” తెలుగు సినిమా హీరోయిన్లు పాడినట్టు అదేం పాట?”
“ఏమో, నాకేం తెలుసు! దీన్లో అలాగే వినిపిస్తుంది.” ఐపాడ్ చూపిస్తూ అన్నారు. “అయినా తెలుగు సినిమా హీరోయిన్ కీ ఈ పాట కీ ఏం సంబంధం?” కుతూహలంగా తనే అడిగారు.
“తెలుగు సినిమా హీరోయిన్లు ఎప్పుడూ ” ఏలాగు ధరియింతునే- బట్టలు-ఏలాగు ధరియింతునే ?” అని పాడుకుంటూ వుంటారు కాబట్టి.”
“అలాగా? ఎందుకు ? అంటే ఏమిటి?”
“అదంతా నీకర్ధమయ్యేది కాదు కానీ, ఏదో ఆ ఒరిజినల్ ఓసారి పెట్టు వింటాను!”
బేహాగ్ రాగంలో అందంగా వస్తుంది జావళి, “ఏలాగు భరియింతునే, విరహమేలాగు భరియింతునే!”
పడీ పడీ నవ్వాను.
***********
అన్నట్టు ఆయనకి అప్పుడప్పుడు బెంగాలీ, గుజరాతీ లాటి భాషల్లో కూడా పాడాలనిపిస్తుంది. ఆ భాషలేవీ ఆయనకి ఒక్క ముక్క కూడా రావు. అయినా ధీరులకి అలాటి చిన్న విషయాలా అడ్డంకి?
“ఇవాళ మనం బెంగాలీ లో ఒక పాట పాడదాం!” చిన్నప్పుడు పిల్లలతో అన్నారు. అప్పటికి వాళ్ళకింకా వాళ్ళ తండ్రి గారి ప్రతాపం తెలిసే వయసు కాదు. అందుకే అమాయకంగా, “బట్ వీ డొంట్ నో బెంగాలీ!” అన్నారు.
“దానిదేముంది! బెంగాలీలో పాడటానికి బెంగాలీ వొచ్చి వుండక్కర్లేదు. మీకే పాట ఇష్టమో చెప్పండి,”
“హంకొమంకీ!” చిన్నది ఉత్సాహంగా అంది. దాని వుద్దేశ్యం “హం కో మన్ కీ శక్తి దేనా” అనే పాట.
“అది బెంగాలీలో ఇలాగుంటుందన్నమాట- “హోం కో మోన్ కీ శోక్తీ ధేనా- మోన్ భీజోయ్ కోరే“- భయంకరంగా పాట సాగిపోతుంది. మా పెద్దమ్మాయికి ఏదో తేడాగా అనిపించింది. “అప్పా ఈజ్ అన్నోయింగ్ మీ” అని ఏడుపు మొదలు పెట్టింది.

*******

కొన్నిసార్లు పాటల లిరిక్స్ ని ఇంప్రొవైజ్ చేస్తారన్నమాట.
చెప్పాలని వుంది, గుండె విప్పాలని వుంది
చెప్పాలని వుంది,
 విప్పాలని వుంది,
చెప్పు
విప్పు
చెప్పి చెప్పి విప్పు
విప్పి విప్పు చెప్పు
ముందు చెప్పవోయ్,
ముందు విప్పవోయ్,”

పిల్లలిద్దరూ ఒకటేసారి, “”పాట ఆపవోయ్”!”  అన్న దాకా అది సాగుతూనే వుంటుంది. రకరకాలైన మాటలూ, రకరకాల లయలతో!
************
కొన్నిసార్లు ఆయన పాటలు ఆశువుగా ఒక భాషలోంచి ఇంకొక భాషలోకి తర్జుమా చేస్తూ వుంటారు.

రెండూ మనసు కావాలి, దేవుడి దగ్గిర అడిగేను!” అనే పాటకి ఒరిజినల్
“ఇరండు మనం వేండుం, ఇరైవనిడమ కేట్టేన్!” ( ప్రేం నగర్ సినిమాలో “మనసు గతి ఇంతే” పాట వుంది చూడండి, దాని తమిళ్ వర్షన్ అన్నమాట.)

ఒండ్రుంసొల్లాదే,, ఒండ్రైయుం సొల్లాదే” అంటే ఎంటో తెలుసా?
కుచ్ నా కహో, కుచ్ భీ నా కహో!”

***************

ఒకటా రెండా, ఎన్నని చెప్పమంటారు, మా ఇంట్లో మా ఆయన నోట్లో,  పాటల పాట్లు.

“తూ ఆతీ హై” కి “తూ హాథీ హై” అని పాడినా, “వొ అందర్ హై” కి “వొ బందర్ హై” అని పాడినా ఆయనకే చెల్లు!

నిన్న రాత్రి భోజనాల దగ్గర,
“ఎండ మండిపోతుంది! గులాబీ మొక్కలకి నీళ్ళు పోసావా” అని నేనడిగిన పాపానికి “గులాబి పూవై నవ్వాలి” అనే పాట ఇష్టం వచ్చిన రాగంలో ఎత్తుకుని నోటికొచ్చినట్టు పాడారు.

మా పెద్దది నాతో సీరియస్ గా, ” ఇదంతా నీవల్లే జరిగింది! తెలుసా?” అంది.
ఎందుకే అని నేనడగకపోయినా, తనే మళ్ళీ, “నువ్వసలు ఇంట్లో తెలుగు హిందీ పాటలు పాడీ పాడీ అప్పాకి అన్ని పాటలూ తెలిసిపోయాయి. నువ్వు పాడకపోతే ఆయన హాయిగా ఫ్లూటు వాయించుకునే వారు, మనకే బాధా వుండెది కాదు. ఇట్ ఈజ్ ఆల్ యౌవర్ ఫాల్ట్, ఇన్ ది ఫస్ట్ ప్లేస్,” అంది.

                             ______________

 

ప్రకటనలు

22 responses »

 1. అవును మరి మీ తప్పే! పాటలు పాడి పాడి ఆయనను హింసపెట్టారేమో! అందుకే ఇలా పగ తీర్చుకుంటున్నారేమో? ఈ యాంగిల్ లో ఆలోచించండోసారి..

 2. కృష్ణ ప్రియ గారూ, జ్యోతిర్మయి గారూ
  మీకలాగే నవ్వులాటలా వుంటుందండీ! ఆ పాటల్ని రోజూ వినే నన్ను గురించి ఆలోచించండి! 🙂

  శర్మ గారూ,
  మీకిది యాగీ లాగుందా? నేనింకా నా “కడుపులో బాధ చెప్పుకోవటం” అనుకున్నా. ఏదో, ఆయనకి తెలుగు చదవటం రాదు కాబట్టి ఇలా సొతంత్రంగా మీతో చెప్పుకున్నా….:)

  కొత్తపాళీ గారూ,
  నాకసలు తెలుగు వచనమే కష్టం మీద అర్ధమవుతుంది. దానికి తోడు మీరిలా అర్ధం కాని భాషలో పాటలు అడిగితే ఎలా చెప్పండి? మాటలు అర్ధం కాకుండా పాటలు వినటం అలవాటైపోయిందనుకోండి! అయినా.. ఆ అర్ధమేదో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి.
  జ్యోతి గారూ,
  అసలు మీరు ముందిది చెప్పండి! మీరు నా పక్షమా, లేకపోతే ఆయన పక్షమా?

 3. మా ఇంట్లో పాడే హక్కు,గొంతు నా ఒక్కదానిదే కాబట్టి ప్రస్తుతానికి ఇంకా మర్డర్లు లేవు. మా అమ్మాయి ఇప్పుడిప్పుడే మొదలెడుతోంది కాబట్టి ప్రమాదం ఇంకా రాలేదు.

  మీ ఇంట్లో జరిగే లాంటి మర్డర్లు చిన్నపుడు మేము చేస్తుండేవాళ్ళం! వాటిని అడ్డుకుంటూ “అసలు అక్కడ శ్రుతేదీ?” “తాళం తప్పలా?” “భాద కాదే, బాధ” అంటూ పాపం మా అమ్మ ఆ వెంటపడేది.

  ఇలా అందరూ కల్సి గోల చేస్తుంటే ఇల్లు చాలా బాగుంటుంది

 4. LOL….. నేనైతే సార్ వైపే ఉంటా..మీ అమ్మాయీ నేనూ ఒక జట్టు..అబ్బా చంపేసారు కదండీ టపా వ్రాసి. నేనొక ప్రేమ పిశాచిని…వామ్మో.. నేనేంటో అనుకుని తెగ ఆలోచిస్తుంటే అదన్నమాట సంగతి…

 5. మడిసన్నాక కాసింత కలాపోసనుండాల. ఉత్తినే తిన్తొంగుంటే మడిసికీ-గొడ్డుకీ తేడా ఏటుంటది?
  .
  “పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ – ఆకాసంలో? సూర్యుడు నెత్తురుగడ్డలా లేడూ?” అని రావుగోపాలరావు సూర్యుడిలో నెత్తుటి గడ్డను చూసినట్టుంది మీ టపా! మీ వారి ప్రఙ్ఞను మీరు సరిగా అర్థం చేసుకున్నట్టుగా లేదు.
  .
  ఈ మధ్య lyricists కష్టపడి ఇలాంటి ప్రయోగాలు చేయటం నేర్చుకుంటున్నారాయె! ఉదాహరణకు, అపరిచుతుడు సినిమా అనుకుంటా, “కాన్పు రాని నిండు గర్భమా!” ప్రేమను తెలియజేయని ప్రేయసినుద్దేసించి ప్రియుడు పాడే పాటలోనిది. వీళ్ళ సిగదరగా! ఇట్టాంటి lyrics కన్నా “నేనొక ప్రేమ పిశాచిని” better కదా!

 6. చిన్నప్పుడు మా కజినొకడు మూగమనసులు సినిమాలో వున్న “నా పాట నీ నోట పలకాల చిలకా..” అనే పాట అరవం లో పాడనా అని అడిగేవాడు.
  మేమంతా వెర్రిమొహాల్లాగ “వీడికి అరవం కూడా వచ్చే..” అని అబ్బురపడిపోయి పాడమనేవాళ్ళం..
  అది…ఇదిగో ఇలా వుండే॑ది..
  “నంగ్ పాట నింగ్ నోట పంగలకాల చింగిలకా…”
  అంతకన్న మీవారి పాట నయమే అనిపించింది నాకు.

 7. ఆద్యంతం నవ్వించింది.
  నా ఓటు మీవారికే.
  ఈ పోష్టు మా ఇంట్లోవాళ్ళకంట పడకుండా చూసుకోవాలి. ఎలా?
  అయినా ఆ మాత్రం sense of humour లేకపోతే జీవితం లో మజా లేదు.

 8. “ఒండ్రుంసొల్లాదే,, ఒండ్రైయుం సొల్లాదే” అంటే ఎంటో తెలుసా?

  ఓండ్ర పెట్టొద్దు అని అనుకున్నా, కాదా!? :))))

 9. devuda,naa laga bali ayye prani inkokaru vunnarannamata.
  maa husband kuda same to same.
  naku ayte ee vedava patalu lekapote poye anipistundi.
  himsaaaaaa adi mamulu himsa kadandi babu.
  bariniche vallake telustundi.nenu ardam chesukogalanu mee badha.
  because we are sailing in the same boat 😦

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s