గాజు బొమ్మలు

నేను ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు అన్నిటికంటే తేలికైన సబ్జెక్టు ఇంగ్లీషు అనుకునేవాళ్ళం. పరీక్షకి నెల రోజుల ముందు కొంచెం కష్టపడి చదివితే బానే మార్కులొచ్చేవి.

ఒక టెక్స్టు బుక్కూ, ఒక నాన్-డిటెయిల్డ్ పుస్తకమూ, ఇంతే! అయితే పదో తరగతి టెక్స్టు బుక్కు మాత్రం చాలా మంచి సాహిత్యంతో పరిచయం చేసిందనుకోండి! అది వేరే సంగతి.

ఇక్కడ ఆస్ట్రేలియాలో మాత్రం ఇంగ్లీష్ స్టడీస్ లెక్కలూ ఫిజిక్స్ కన్నా గొట్టైన సబ్జెక్టు. మా మధుకప్పుడే ఆ సబ్జెక్టు తలచుకుంటేనే తెల్ల వార్లూ చెమటలు పడుతున్నాయి. ఇంతకీ సంగతేమిటంటే, అయిదు పుస్తకాలని కూలంకుషంగా విశ్లేషించాలి. మా అమ్మాయి బారిన పడ్డ పుస్తకాలు, కింగ్ లియర్, అటోన్మెంట్, పాసేజ్ టు ఇండియా, కైట్ రన్నర్, ఇంకా ది గ్లాస్ మెనేజరీ. ఇందులో నేనింతకు ముందు చదవంది ఒక్క “ది గ్లాస్ మెనేజరీ”. నిన్ననే ఆ పుస్తకం చదివాను. చాలా బాగుంది.

ఇదొక చిన్న నాటకం. దీన్ని టెన్నెస్సీ విలియమ్స్ 1944 లో రాసారు.

తన సొంత కథనే “(Portrait of a girl in glass)” నాటకంగా మార్చారాయన. అయితే కథ కంటే నాటకం చాలా ప్రాచుర్యం పొందింది. నలుగురే పాత్రధారులున్న చిన్న నాటకంలో ఆయన ఆర్ధిక మాంద్యమూ, విచ్చిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థా, మగవాడి బాధ్యతా రాహిత్యమూ, స్త్రీల నిస్సహాయతా అన్నిటినీ చాలా మృదువుగా స్పృషించారు.

ఈ నాటకంలో కథ ఒక ఎత్తైతే, దాన్ని ఫ్లాష్ బేక్ పధ్ధతిలో చెప్పటం ఇంకొక ఎత్తు. నాటకాల్లో ఫ్లాష్ బేక్ పధ్ధతిని “మెమొరీ ప్లే” అంటారు. మెమొరీ ప్లే మొదట్లో సూత్రధారి తన వ్యాఖ్యానాలతో నాటకాన్ని మొదలు పెడతాడు. అతను అంతకు ముందు జరిగిన కథను ఏకరువు పెడుతూ వుంటాడు. ఆ కథలో కొన్నిసార్లు అతనే పాత్రధారి అయి వుండొచ్చు కూడా.

కథ స్థూలంగా వింగ్ ఫీల్డ్ కుటుంబ సభ్యుల కథ. యువకుడైన టామ్, చెల్లి లారా, తల్లి అమాండా తో కలిసి జీవిస్తుంటాడు. లారా వికలాంగురాలు. భర్త వదిలేయటంతో అమాండా పిల్లలిద్దరినీ తనే కష్టపడి పెంచుతుంది. టామ్ ఒక చిన్న దుకాణంలో పని చేస్తుంటాడు. ఎలాగైనా లారాని జీవితంలో స్థిరపడేలా చేయాలని అమాండా ఆత్రం. లారాని టైపూ షార్టుహేండు కోర్సులో చేర్పిస్తుంది తల్లి. అయితే తన శారీరక వైకల్యం కలిగించిన భయంకరమైన న్యూనతా భావనలో మునిగి వున్న లారా, క్లాసులకి భయపడి ప్రతి రోజూ ఎగ్గొడుతూ వుంటుంది. అది తెలుసుకున్న తల్లి, ఆ ప్రయత్నం మాని కూతురికి పెళ్ళి చేయాలనుకుంటుంది. అందుకై టామ్ ని తనతో పని చేసే స్నేహితులెవరినైనా చెల్లికి పరిచయం చేయమని రోజూ పోరుతూ వుంటుంది. ఆమె నస భరించలేక టామ్ ఒక రోజు జిమ్ అనే యువకుణ్ణి రాత్రి భోజనానికి ఆహ్వానిస్తాడు. వెంటనే అమాండా పొంగిపోయి చాలా హడావిడి పడుతుంది. ఖర్చు చేసి ఇంట్లోకి మంచి రగ్గూ, కొత్త సామానూ, అన్నీ కొంటుంది. చక్కటి భోజనం తయారు చేస్తుంది. ఎలాగైనా జిమ్ కి కూతురితో అయిదు నిమిషాలు ఏకాంతం చిక్కితే తన కూతురి తెలివితేటలకీ, మంచి తనానికీ ఆకర్షితుడవుతాడనీ, తప్పక ఆమెని పెళ్ళాడతాడనీ అమాండా ఆశ. అమాండా ఆశ నెరవేరిందా లేదా అన్నదే మిగతా కథ.

పుస్తకమంతా కలిపి దాదాపు యాభై పేజీలు కూడ వుండదు. కానీ ఒక్కొక్క పాత్రలోని సంఘర్షణా, నిస్సహాయతా మన కళ్ళ ముందుండేటట్టు చిత్రీకరించిన విధం అద్భుతం. నిజానికి భాష అంత సాఫిస్టికేటేడ్ గా కూడా వుండదు. కానీ నాటకం చదివిన తరువాత ఏదో నొప్పీ, నిర్వచించలేని బాధా మనని ముంచేస్తాయి.

టామ్- చేస్తున్న నిరాసక్తమైన చిరుద్యోగానికీ, తన ఆశలకీ మధ్య నలిగిపోతున్న యువకుడు. వాస్తవాన్నించీ, బాధ్యతలనించీ తప్పించుకోవటానికి రోజూ రాత్రి పూట సినిమాకి వెళ్తూ వుంటాడు. దీనితో తల్లితో తప్పని ఘర్షణలు! పంతొమ్మిది వందల నలభైల్లో అమెరికాలోని ఆర్ధిక మాంద్యానికీ, నిరుద్యోగానికీ ఇతను ప్రతీక. బాధ్యతలనించి తప్పించుకొని పారిపోవాలని ఆశ పడుతూ, అలా ఆస పడుతున్నందుకు అపరాధ భావన కింద నలిగిపోయే సామాన్యుడు. నాటకమంతా ఇతని స్వగతమే!

అమాండా- గడిచిపోయిన వైభవాన్నీ, తరిగిపోయిన తన అంద చందాలనీ, చేజారిపోయిన కలలనీ తలచుకుని నిట్టూరుస్తూ, పిల్లలైనా సుఖపడాలని తాపత్రయ పడే తల్లి. ఆమె నాటకీయతా, ఓవర్-ఆక్షనూ తెలుగు సినిమాల్లో తల్లులని తలిపించినా, ఆమెని చూస్తే జాలి కలగక మానదు. తను చాలా తెలివైనదాన్ననీ, తన మేనిప్యులేషన్ ముందు ఎలాటి వారైనా నిలవలేరనీ అనుకునే అమాయకురాలు.

లారా- అంగ వైకల్యంతో బ్రతుకీడుస్తూ, తల్లికీ అన్నకీ తను భారంగా వున్నానని తెలిసినా ఏమీ చేయలేని అశక్తురాలు. ఆత్మ న్యూనతా భావంతో ఎప్పుడూ మౌనంగా ఇంట్లో వున్న గాజు బొమ్మలతో ఆడుకుంటూ, వాటిని పదే పదే తుడుస్తూ కాలం గడుపుతూ వుంటుంది. కథలో, పేరులోనూ గాజుబొమ్మలని లారా మనసుకీ, అమాండా ఆశలకీ ప్రతీకలుగా వాడినట్టంపిస్తుంది. (గాజుబొమ్మల్లా కలలూ, మనసులూ పగిలిపోతాయి కదా?)

ఈ నాటకాన్ని అమెరికాలో థియేటర్లోనూ, తెర మీద సినిమాగానూ, టీవీ నాటకం గానూ తీసారు.  1973 లో కేథరీన్ హెబ్బర్న్, సాం వాటర్సన్, జో-ఆనా మైల్స్ నటించగా టీవీ నాటకంగా వచ్చింది. ఇది యూ-ట్యూబులోనూ దొరుకుతుంది.

అయితే దానికంటే గొప్ప విశేషమొకటి వుంది. ఈ కథని “అకాలే” అనే పేరుతో మలయాళంలో సినిమాగా తీసారు. 2004 లో రిలీజైన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది, మాటి మాటికీ నేషనల్ అవార్డు కొట్టేసే శ్యాంప్రసాద్. (ఒరే కడల్, అగ్ని సాక్షి). ఈ సినిమాకి కూడా “ఉత్తమ ప్రాంతీయ చిత్రం” తో పాటు బోలేడు ఇతర అవార్డులూ వచ్చాయి. టామ్- లారా- అమాండా ల పేర్లని నీల్-రోజ్ మేరీ- మార్గరెట్ గా మార్చి ఈ సినిమా తీసారు. నటించింది పృథ్వీరాజ్, గీతూ మోహన్ దాస్, షీలా. ఈ సినిమాలో వాళ్ళ ముగ్గురి నటనని చూసి నోరావలించటమే మన పని. ఇది కూడ యూ- ట్యూబు లో వుంది కాబట్టి అందరూ అర్జెంటుగా చూసెయ్యండి. లేదా చాలా గొప్ప అనుభవాన్ని మిస్సవుతాం.

5 thoughts on “గాజు బొమ్మలు

  1. మాకు ఎమ్.ఏ. ఫస్ట్ ఇయర్లోనేమో “కింగ్ లియర్” ఉండేది. “పాసేజ్ టు ఇండియా” ఛాయిస్ లో వదిలేసిన గుర్తు..:)

    story బాగా చెప్పారు. కథ కూడా ఆసక్తికరంగా ఉంది. వీలు చూసుకుని చూసేస్తానుండండి. లింక్ ఇక్కడ టపాలో పెట్టాల్సిందండి. వెతుక్కోవాలంటే కొంచెం బధ్ధకం వేస్తుంది కదా..

  2. గాయత్రి గారూ,
    ధన్యవాదాలు.
    పద్మజ గారూ,
    అవునండీ! ఇంగ్లీషు సబ్-టైటిల్స్ లేవండీ! అయితే సంభాషణల్లో ఎక్కువగా ఇంగ్లీషే వాడటం వల్ల అంత పెద్ద ఇబ్బంది గా అనిపించలేదు. నాకు తమిళం బాగా రావటం వల్ల మలయాళం కూడా కొంచెం కొంచెం బానే అర్ధం అవుతుంది.
    తృష్ణ గారూ,
    ఇదిగోనండీ యూ ట్యూబు లింకులు.(There are about ten parts. I have given the first five. The rest will be flashed on your screen anyway…)

    శారద

Leave a reply to madhuri స్పందనను రద్దుచేయి