నేనూ-తెలుగు సినిమా

నేనూ-తెలుగు సినిమా

అందరూ ఒకటే తెలుగు సినిమా రివ్యూలు రాసేస్తున్నారు. నేనేమో థియేటర్లో తెలుగు సినిమా చూసి దాదాపు అయిదేళ్ళవుతుంది. ఆఖర్న నేను చూసింది “గోదావరి” అనుకుంటా. ఆ తర్వాత “గమ్యం” సినిమా డీవీడీలో చూడటంతో నా తెలుగు సినిమా ప్రస్థానం ఆగిపోయింది.

తెలుగు సినిమా హీరోయిన్ల దుర్భర దారిద్ర్యం తీరిపోయి వాళ్ళకి ఒంటి నిండా బట్టలిచ్చే నాధుడు (నిర్మాత?) దొరికేవరకూ నేను తెలుగు సినిమాలు చూడనని ఒట్టేసుకోవకటం వల్ల వచ్చిన ఉపద్రవం ఇది.

ఇప్పుడంటే ఇలా తెలుగు సినిమాలూ నేనూ ఎడ మొహం-పెడ మొహం అయ్యాం కానీ, చిన్నప్పుడు నాకు సినిమాలంటే భలే ఇష్టంగా వుండేది.

గుండ్రాలు తిరిగి నా బాల్యంలోకెళ్తే నాకుండే ఙ్ఞాపకాలు, చాలా సినిమాలతోనే ముడి పడి వున్నాయి. అన్నిటికంటే మిక్కిలి బాధాకరమైనది ఇంట్లో అంతా మమ్మల్ని (అంటే చిన్న పిల్లలని) వదిలేసి సెకండ్ షో సినిమాకెళ్ళటం! ఈ అరాచకం ఎక్కువగా సెలవుల్లో అమ్మమ్మా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు జరిగేది. హైదరాబాదు లో వున్నప్పుడు తనతో పాటు నన్నూ సినిమాకి తీసికెళ్ళే అమ్మ పుట్టిల్లు చేరగానే నన్ను మిగతా పిల్లల్తో వదిలి తన పరివారంతో సినిమాకెళ్ళేది. నేనేం చిన్నదాన్నా, చితకదాన్నా? అప్పటికే అయిదేళ్ళొచ్చేసాయి. తెలుగు హిందీ సినిమాలు చక్కగా అర్ధం అయ్యేవి కూడా! అలాటి సమయాల్లో అసలు బ్రతుకు మీదే ఒకలాటి విరక్తి కలిగేది.

అలాటి ఙ్ఞాపకాల్లో ఇప్పటికీ రక్తం కారే గాయం “భక్త తుకారాం” సినిమా విషయం లో జరిగింది. ఆ సినిమాకి అమ్మ నన్ను ఇంట్లో నాన్నగారి దగ్గరొదిలేసి తనొక్కతీ అత్తయ్యతో కలిసి వెళ్ళి చూసింది! నన్ను తిసికెళ్ళకపోవటమే కాదు, రెండేళ్ళ మా చెల్లిని తీసికెళ్ళింది. నా మనసు అవమానంతో భగ్గుమంది! నాకంటే అమ్మకి చెల్లి మీదే ప్రేమ ఎక్కువేమో అన్న ఆలోచనతో తిరగబడాలనుకున్నాను. అయితే మనకి కొంచెం ప్రభుత్వంలో “ఇంఫ్లుయెన్సు” వుండటం మంచిదన్న దూరాలోచనతో నాన్న దగ్గర చేరాను.

రాత్రి నాకు అన్నం తినిపించి పక్కనే పడుకోబెట్టుకున్నారు నాన్న. ఆయన చెప్పే కథలు వింటూ మెల్లగా నాకు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావన తెచ్చాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు, అమ్మ అసలు మంచిది కాదని! దాంతో అమ్మకి తగిన శిక్ష వేయాలని నిర్ణయించాను. నాకు బాగా నిద్రొస్తుంది కాబట్టి, అమ్మ వచ్చేంత వరకూ మేలుకుని వుండలేను. అందువల్ల అమ్మ సినిమా నించి ఇంటికొచ్చినప్పుడు తలుపు తెరవొద్దని తీర్పు చెప్పాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. రాత్రంతా బయట వాకిట్లోనే నిలబడే అమ్మా- చెల్లాయిల గురించి శాడిస్టిక్ కలలు కంటూ నిద్ర పోయాను.

మర్నాడు అమ్మ మంచం మీద నన్ను ముద్దు పెట్టుకుంటుంటే లేచి ఇంకా ముద్దులు పెట్టుకోమని రెండో చెంప అందించబోయి……
 కెవ్వుమన్నాను! అమ్మ లోపలికెలా వొచ్చింది. అసలు నాన్న, ఆ ద్రోహి ఎక్కడా? ఆయనెప్పుడూ అమ్మ పార్టీయేలే అనుకుంటూ లోపలికి పరిగెత్తి అడిగాను “నాన్నా! అమ్మ లోపలికెలా వొచ్చింది?” అని.

మా నాన్న జాలిగా మొహం పెట్టి, “అసలు ఎంత బతిలాడినా లోపలికి రానివ్వలేదు నాన్నా! కానీ బాగా చీకటయ్యి అమ్మా- చెల్లీ బాగా బయపడ్డారు. ఇంకోసారెప్పుడూ నిన్ను వదిలిపెట్టి సినిమాకెళ్ళోద్దని బాగా తిట్టానిద్దర్నీ” అన్నారు. ఇంకేం చేస్తాం. సరే పోనిలే అని వెళ్ళి మంచం మీద అమ్మతో మిగతా ముద్దులు పెట్టించుకున్నా!

అంత రాక్షసంగా నా మనసుని ముక్కలు చేసింది తెలుగు సినిమా! ఆ తర్వాత అమ్మనొదిలి స్నేహితులతో నేనూ చాలా సార్లు సినిమాకెళ్ళి పగ తీర్చుకున్నా అనుకోండి, అది వేరే సంగతి.

దాదాపు 1990 వరకు నేను బాగానే తెలుగు సినిమాలు చూసేదాన్ని. హైదరాబాదు వదిలేయటం వల్ల కొంతా, వాటి క్వాలిటీ రోజు రోజుకీ పాతాళంలోకి ప్రయాణిస్తుండటంవల్ల కొంతా సినిమాలు తగ్గిపోయాయి.

ఇప్పుడైతే తెలుగు సినిమా ప్రకటనలకి జడుసుకోని నేను మా ఇంట్లో తెలుగు టీవీ చానెల్సు కూడా పెట్టించనివ్వను!
“ఇంద్ర”, “పోకిరీ”, “కిక్”, “ఇడియెట్” “అరుంధతి” ల నించీ, “దూకుడు”,”పాకుడు”,”మొగుడు” “ఉసరవెల్లి” “పెంపుడు బల్లి” ఎన్ని సినిమాలు, ఎలాటి సినిమాలొచ్చినా నాకు భయం లేదు.

కిందటి సారి హైదరాబాదులో వుండగా నాన్న “ఇంట్లో బోరు కొడితే అలా సినిమాకెళ్ళొస్తారా నువ్వూ అమ్మా పిల్లలూ?” (మా ఇంటి పక్కనే థియేటర్ వుంది లెండి!)
“హమ్మో! సినిమానా? వొద్దులే!” అన్నాను.

నెల రోజుల కింద మా మధు అదేదో సినిమాలో తమన్నా పాటేదో చూసిందట స్నేహితులింట్లో. నాతో నవ్వుతూ చెప్పింది, “అమ్మా! ఇక నువ్వు తెలుగు సినిమా హీరోయిన్లు స్కింపీ బట్టలేసుకుంటున్నారని  బాధ పడే పనిలేదు” అని. “ఎందుకే” అంటే, “ఇందాక ఒక పాటలో హీరోయిను అసలు బట్టలే వేసుకోలేదు,” అని నవ్వింది

»

  1. :) మీ అమ్మాయి చెప్పినట్టు ఇక మీరు బాధ పడాల్సిన పని లేదు. ‘మొగుడు’ తో మళ్లీ సినిమాలు చూడటం మొదలు పెట్టండి :) Just kidding. ఒక్కోసారి ఇరవై మంది బాగుందని చెప్తే వెళ్లిన సినిమాలు కూడా భరించరానివి గా ఉంటున్నాయి…
    కానీ ఒక్కోసారి కొన్ని సరదాగా నే ఉంటాయి లెండి. పూర్తి గా కాంటెస్ట్ పోతే ఆ ఒకటి రెండూ కూడా అస్సలూ ఆస్వాదించలేము.

  2. కృష్ణ ప్రియ గారూ,
    ఒక పదేళ్ళ కింద ఒక కార్టూను చూసానండీ! పిల్లలతో సినిమాకెళ్తున్న ఒకావిడ పక్కింటావిడతో, “ఆ, పిల్లలతో తెలుగు సిన్మా కేం వెళతాలేగానీ, ఇంగ్లీషు సిన్మాకెళ్తున్నా వదినా,” అంటుంది. ఇప్పటికీ నాకా కార్టును తలచుకుంటే నవ్వొస్తుంది. అలాగే, ఇహ ఇప్పుడీ వయసులో కొత్త తెలుగు సినిమాలేం చూస్తా గానీ, ఈ జన్మ కిలా వెళ్ళిపోనివ్వండి!:)
    మాలా గారూ,
    అవునండీ!
    కొత్తపాళీ గారూ,
    బలే కాచీ పేరు కదా? అసలు చాలా వరకు సినిమాల పేర్లే putting us off అనిపిస్తుంది!
    శారద

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )