Posted by: sbmurali2007 on: సెప్టెంబరు 22, 2008
స్నేహం! ఎంత తియ్యని పదం! ఇంకెంత తీయని భావం.
సృష్టిలో తీయనిది
-శారద
(రచన మాస పత్రిక సెప్టెంబరు 2008)
స్నేహం! ఎంత తియ్యని పదం! ఇంకెంత తీయని భావం. మనం నవ్వినపుడు మనతోపాటు నవ్వి, బాధ పడ్డప్పుడు ఓదార్చే స్నేహితులు వుండటం ఎంత అదృష్టం. చాలా కొద్దిమంది మాత్రమే మనసు విప్పి హాయిగా ఈర్ష్యా అసూయలు లేకుండా స్నేహం చేయగలరేమో.
నాకు కౌముదిని చూసినప్పుడల్లా, నేను బెంగాలీ స్త్త్రీని కానందుకు ఒకింత దిగులు వేస్తుంది. కౌముది, నవ్వుల పడవ, మాటల తోట, హుందాగా వుండే స్త్రీ మూర్తి. ఇద్దరం ఒకే ఆఫీసులో పని చేస్తూ వుండటం వల్ల దాదాపు రోజూ కలుసుకుని మాట్లాడుకుంటూనే వుంటాము. నాకామెలో అన్నిటికన్నా నచ్చేవి, ఆమె చిరునవ్వూ, ఇబ్బందుల్లో వున్నప్పుడామె తన స్నేహితులకి చేసే సహాయాలూ! అవటానికి ఇద్ద్దరం భారతీయులమే అయినా, ఆఫీసు దాటితే ఆమె బెంగాలీలతోనూ, నేను తెలుగు వాళ్లతోనూ వుంటాము. అందువల్ల బయట ఒకళ్ళకొకళ్ళం తారసపడటం తక్కువే. అయినా ఆమె బెంగాలీ సంఘంలో చాలా చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి నాకు బెంగాలీ వాళ్ళ కబుర్లన్నీ ఎప్పటికప్పుడు చెప్తూనే వుంటుంది కౌముది. ఎవరికేదయినా అవసరం వచ్చినప్పుడామె చొరవగా ముందుకొచ్చి పని నెత్తినేసుకుంటుంది. మేము ఇల్లు మారేటప్పుడు వద్దు వద్దంటున్నా నాలుగు రోజులు భోజనం వండి కారియర్లో పంపించింది.
వున్నట్టుండి మా ఆఫీసులో ఇంకొక భారతీయ స్త్రీ, అందునా బెంగాలీ చేరుతోందని విన్నప్పుడు ఆనందంతో కెవ్వుమంది కౌముది.
“ఇక మీరిద్దరూ బెంగాలీలో మాట్లాడుతూ నన్ను మరచిపోతారేమో”, నవ్వుతూనే అన్నాను.
“నో! నో! యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఒయ్ విల్ టీచ్ యూ బెంగోలీ”, వింతగా ధ్వనించే ఆమె బెంగాలీ యాసంటే నాకెంతో ఇష్టం.
అనుకున్నట్టుగానే సునాద వచ్చి చేరగానే, ముగ్గురం మంచి స్నేహితులమయ్యాం. అప్పుడప్పుడూ ఇద్దరూ బెంగాలీలోకి జారిపోయినా మళ్ళీ నేను వాళ్ళని ఇంగ్లీషులోకి లాగుతూ వుండే దాన్ని. సునాద వాళ్ళు కొత్తగా అడిలైడ్ రావటంతో చాలా ఇబ్బందులు పడే వాళ్ళు. కౌముది వాళ్ళకి చాలా రకాలుగా సహాYఅం చేసేది. పిల్లలకి స్కూలు అడ్మిషన్లలో, ఇంటికి దగ్గరగా షాపింగ్ సెంటర్లు చూపించటంలో, ఒకటేమిటి, సునాదకి ఏ ఇబ్బంది వచ్చినా కౌముది దగ్గర దానికొక పరిష్కారం వుణ్డేది.
అంత ఆత్మీయమైన వాళ్ళ స్నేహం చూసి నేను కొంచెం ఈర్ష్య పడ్డమాట కూడా నిజం. అదేమిటో, మరి తెలుగు వాళ్ళతో పదేళ్ళనించీ కలిసి వున్నా నాకంత మంచి స్నేహితులు లేరు. ఏదో, కనిపించినప్పుడు హల్లో, హల్లో అని పలకరించుకునే వాళ్ళమే కానీ, స్నేహం ఆత్మీయత ఏవీ వుండవు అనిపిస్తుంది. అసలు వున్నట్టుండి నేను మాయమై పోతే ఎవరూ పట్టించుకోరు అన్న అనుమానం కూడా అప్పుడప్పుడూ నన్ను పీడిస్తుండేది. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని సర్ది చెప్పుకున్నాను.
కొత్తగా రావటంతో ఇక్కడ చలి కాలం తట్టుకోలేకపోయింది సునాద. పెద్ద పెట్టున జ్వరంతో, వైరల్ ఇన్ఫెక్షన్తో రెండు వారాలు తీసుకుంది. అప్పుడంతా ఆమె పిల్లల పనీ, ఇంటి పనీ కౌముదే నెత్తినేసుకుంది. జ్వరం అదీ తగ్గి ఆఫీసుకి వచ్చినా, ఇంకా చాలా నీరసంగానే వుంది సునాద. ఇద్దరం ఆమెని ఆఫీసులో బాగానే కనిపెట్టుకుని వున్నాము.
ఒక రోజు సునాద లేనప్పుడు నేనూ కౌముదీ లంచ్ చేయటానికి రెస్టారెంట్ కెళ్ళాం. అక్కడ కనపడిన ఇంకొక బెంగాలీ స్త్రీ సునాద గురించి కౌముదిని అడిగింది, ‘మీ ఫ్రెండ్ ఏదీ’ అని. సునాద వచ్చి కొన్ని రోజులే అయినా బెంగాలీ వాళ్ళలో మంచి పేరు తెచ్చుకుందనీ, చాలా చురుగ్గా అన్ని కార్యక్రమాల్లోనూ పని చేస్తుందనీ అర్ధమయింది నాకు ఆమె మాటలు వింటూ వుంటే. నాకు చాలా సంతోషం వేసింది తను ఆరు నెలల్లోనే కొత్త ప్రదేశం లో అంత బాగా అడ్జస్ట్ అయినందుకు.
స్వతహాగా కొంచెం మొహమాటస్తురాలినే అయినా ఈమధ్యే కౌముదిని చూసి నేనూ అందరితో కలుపుగోలుగా వుండాలని నిర్ణయించుకున్నాను.
అందుకే సునాద నాతో, దుర్గా పూజ సందర్భంగా బెంగాలీ అసోసియేషన్ చేస్తున్న సాన్స్కృతిక కార్యక్రమానికి పిలవంగానే వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. ఆ కార్యక్రమంలో కమిటీ మెంబరయిన సునాద అనారోగ్యాన్ని లెఖ్ఖ చేయకుండా శ్రమ పడింది పాపం.
కార్యక్రమం రోజు సునాద ఆఫీసుకి లీవు పెట్టింది. మధ్యాహ్నం లంచ్ టైంలో అడిగాను కౌముదిని, “ఇవాళ సాయంత్రం మీ ప్రోగ్రాంలో కలుస్తాం కదా” అని. కౌముది కొంచెం మొహం ఇబ్బందిగా పెట్టి, “లేదు శ్రీలతా! ఇవాళ నాకు పని ఎక్కువగా వుంది. నేను ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అవుతుంది. ప్రోగ్రాం కి వెళ్ళలేనేమో,” అంది. చాలా ఆశ్చర్య పోయాను.
ఇంతకు ముందు నేనూ అదే సెక్షన్ లో పని చేసాను. ఎక్స్ ట్రా పని కాదు కదా, ఆ సెక్షన్ లో మామూలు ఎనిమిది గంటలకే సరి పడా పని వుండదని అందరూ నవ్వుతూ వుంటారు. ఒకవేళ దారి తప్పి ఒక్క రోజు కొంచెం పని ఎక్కువైనా, అది మర్నాడు చేసుకున్నా ఎవ్వరూ అడగరు. అటువంటిది సాయంత్రం ప్రోగ్రాంకి కూడా రానంత పనేమిటబ్బా, అనుకున్నాను.
ఆ రోజు సాయంత్రం ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. నాకు భాష అర్ధం కాకపోయినా, వాళ్ళందరూ ఇంగ్లీషులో కాకుండా బెంగాలీలో మాట్లాడుకోవటం, రవీంద్ర సంగీత్ పాటలు, మైల్డ్ గా గమ్మత్తుగా వుండే వాళ్ళ నృత్యాలు చాలా నచ్చాయి. మధ్యలో సునాద రాసి దర్శకత్వం వహించిన నాటకం ప్రదర్శించారు. చిన్నదైనా, హాస్య నాటిక చాలా బాగుంది. భోజనాలప్పుడు అందరూ సునాదని అభినందిస్తూ వుంటే, చాలా గర్వంగా మా వారికీ పిల్లలకీ పరిచయం చేసాను.
“మీ ఇంకొక స్నేహితురాలు కౌముది రాలేదే?” అడిగారు మావారు. “ఆఫీసులో ఎక్కువగా పని వుందని ఆగిపోయింది,” సునాదకీ మా వారికీ కలిపి సంజాయిషీలా చెప్పాను. సునాద ఏమీ అనలేదు కానీ చిన్నగా నవ్వి వూరుకుంది.
**************************************
ఆ తరువాత సోమవారం ఆఫీసులో లంచ్ చేయటానికి నేనూ సునాద కలిసి ఎప్పట్లాగే కౌముది కోసం వాళ్ళ సెక్షన్ కి వెళ్ళాము. మమ్మల్ని చూడగానే విసుగ్గా లేచి, “ఇవాళ నేను చాలా బిజీ. బయటికి రావటానికి కుదరదు,” అంది. కొంచెం చిన్నబోయినా, మేమిద్దరం వెళ్ళిపోయాము. ఇలాగే వారం రోజులూ మాతో భోజనానికి కానీ కనీసం టీకి కానీ రాలేదు. మెల్లిగా మేమిద్దరమే వెళ్ళటం మొదలు పెట్టాము.
మళ్ళీ నెల రోజులకి సునాద ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిసి మేమిద్దరం లంచ్ చేస్తుంటే వచ్చింది కౌముది. దొంగతనం జరగగానే తనకి చెప్పనందుకు సునాదని ఛెడా మడా తిట్టింది. “నీకింత పెద్ద కష్టం వస్తే నాకెందుకు చెప్పలేదు?” అంది. సాయంత్రం వాళ్ళ ఇంటికొస్తానని చెప్పి మాతో పాటే కూర్చుంది. ఆ తరువాత అంతా మామూలే. ఆమె మూడ్ స్వింగ్స్ కొంచెం వింతగా అనిపించినా, ఏమోలే అనుకున్నాను.
ఈ రకమైన అర్ధం కాని ప్రవర్తన నేనా సంవత్సరం పొడుగునా చూసాను. అంతలోకే సునాదతో అరమరికలు లేని స్నేహం, అంతలోకే మొహం చిట్లించి చులకనగా తీసి పారెయ్యటం, నాకెంత ప్రయత్నించినా అర్ధం కాలేదు. సునాద మాత్రం తన మూడ్స్ తోటి ప్రమేయం లేనట్టు ఒకే రకంగా ఉండేది. మనిషి లేనప్పుడు తన గురించి చర్చించుకోవటం మా ఇద్దరి సంస్కారం లోనూ లేకపోవటం వల్ల మేమెప్పుడూ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించుకోలేదు. ఒకే ఒక్క సారి మాత్రం అంది సునాద నాతో నవ్వుతూ,
“కౌముదికి తను అందరికీ సహాయం చేయటం ఇష్టం. కానీ తను మాత్రం మన సహాయం ఇష్టపడదు. ఎంత జబ్బు పడ్డా మా ఇంటి నించి భోజనం పంపిస్తానంటే తీసుకోలేదు. అలాటప్పుడు నాకు కూడా మాటి మాటికీ ఆమె సహాయం తీసుకోవాలంటే కొంచెం మొహమాటంగా వుంటుంది,” అని.
అంతలోకే మా ఇండియా ప్రయాణం దగ్గర పడటంతో అన్ని విషయాలూ వదిలి ఏర్పాట్లలో ముణిగిపోయాను.
****************************************
“రంగా రావు మావయ్య వాళ్ళింటికెళ్ళొద్దామా?” వెళ్ళిన నాలుగు రోజుల తరువాత అడిగాను అమ్మని.
“ఇప్పుడెందుకులే! అయినా మనం వాళ్ళ కళ్ళకిప్పుడు కనబడేలా కూడా లేదు.” చిరాగ్గా అంది అమ్మ.
రంగా రావు మావయ్య వాళ్ళు మాకు చుట్టాలేమీ కాక పోయినా చాలా యేళ్ళు ఒకే లొకాలిటీలో వుండాటం వల్ల మంచి స్నేహితులు. వాళ్ళది చాలా బీద కుటుంబం కావటంతో అమ్మ వాళ్ళకి చాలా సహాయ పడుతూ వుండేది. మా కంటే యేడాదో రెండేళ్ళో చిన్న వాళ్ళైన పిల్లవటం వల్ల మా పుస్తకాలన్నీ వాళ్ళకే ఇచ్చే వాళ్ళం. పచ్చళ్ళూ, బట్టలూ, చెప్పులూ ఏదో ఒక వంకతో మా అమ్మా నాన్నా వాళ్ళకి ఇస్తూ వుండే వాళ్ళు. అదృషం బాగుండి వాళ్ళ పిల్లలు ముగ్గురూ బాగానే చదువుకున్నారు. కాల్ సెంటర్ల పుణ్యమా అని డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఎప్పుడు ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాలకి సానుభూతి చూపించే అమ్మ మాటల్లో ఒక్క సారే అసహనం, విసుగూ! ఎందుకో అర్ధం కాలేదు.
మర్నాడు అమ్మ వద్దంటున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకైతే వాళ్ళల్లో ఏమీ మార్పు కనిపించలేదు. ఇంకొంచెం ఆత్మ విశ్వాసంతో, ఆరోగ్యంగా హాయిగా వున్నారు. ఇంటికొచ్చిన తరువాత కూడా అమ్మ సణుగుతూనే వుంది. ఆఖరికి వుండ బట్ట లేక అడిగాను, “ఇప్పుడేమిటి నీ బాధ? వాళ్ళేమైనా అన్నారా? ఎప్పట్లాగే వున్నారే?” అని. “అబ్బో! ఎప్పట్లాగెందుకు వుంటారు? వాళ్ళకి ఇప్పుడు మనతో ఏం అవసరం వుందని కనక? ఒకప్పుడంటే మనం చేసే సహాయం వల్లే వాళ్ళకి గడిచేది. ఆ విషయం కూడా మర్చి పోయారు.” “ఇప్పుడా విషయం మాటి మాటికీ గుర్తు చేసుకుంటూ నీకేమైనా మంగళ హారతులివ్వాలా? గతంలో సహాయం అవసరమైనప్పుడు చేసాం. ఆ సహాయం అంది పుచ్చుకుని వాళ్ళు అభివృద్ధి లోకొచ్చారు. అది చూసి సంతోషించాలే గానీ, వాళ్ళింకా దాన్నే తల్చుకుంటూ నీకు మాటి మాటికీ థేంక్స్ చెప్పాలనుకోవటం ఏమీ బాగా లేదు.” కొంచెం విసురుగానే అన్నాను. నా మాటల గురించి ఆలోచిస్తున్నట్టు అమ్మ మౌనంగా వుండిపోయింది.
******************************
ఇండియా నించి వచ్చి మళ్ళీ ఆఫీసుకెళ్ళాను. ఎప్పట్లాగే వుంది కౌముది. కానీ ఇప్పుడు తన మనస్తత్వం నాకు బాగా అర్ధం అయింది. కౌముది కూడా మా అమ్మ లాగే, తన అవసరం వున్నప్పుడే మనుషుల మీద ప్రేమా అభిమానం చూపించగలదు. తన అవసరం లేని వాళ్ళ పైనా, స్వతంత్రంగా వుండగలిగే మనుషులపైనా ఆవిడకి ఎటువంటి ఆసక్తీ వుండదు. చాలా వింతగా వుంది. “ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్” అని విన్నాం గానీ, ఇలా ఎప్పుడూ చూడలేదు, అనుకున్నాను.
“నా స్నేహితులకి బోలెడు కష్టాలొస్తే నేను వాళ్ళకి సహాయం చేసి నేనెంత మంచి దాన్నో నిరూపించుకుంటాను” అనుకోవటంలో స్నేహితులకి కష్టాలు రావాలన్న మనో వికారం కనపడుతుంది. అందుకే కౌముది కి తన అవసరం వున్నప్పుడే స్నేహితులని అభిమానిస్తుంది. తనతో ప్రమేయం లేకుండా సంఘంలో సునాద పేరు తెచ్చుకుంటే కొంచెం ఈర్ష్య! మళ్ళీ అదే సునాద కి తన అవసరం వస్తే స్నేహితురాలు.
పక్క మనిషికి అవసరం వస్తే మొహం చాటేసే వాళ్ళున్న ఈ రోజుల్లో ఏ అవసరానికైనా ముందుండి చేయందించటం ఎంత మంచి మనస్తత్వం, అనే అనుకున్నానిన్నాళ్ళూ! కానీ దీపం కింది నీడలా ఆ ఆలోచన వెనక ఎంత మసి దాగుందో తెలిసాక అంతగా నచ్చలేదు. కౌముది మనతో అభిమానంగా, ప్రేమగా వుండాలంటే మనకి కష్టాలొస్తూ వుండాలన్న మాట. కౌముది నాకు స్నేహితురాలు కానందుకు మొదటిసారి సంతోషించాను.
***********************************
WordPress.com లో Blog పెట్టుము.
Albeo theme by Design Disease