దబ్బుమని కార్లోనించి కిందికి పడ్డాను. కోపంగా లేచి నిలబడి, “ఆగరా ప్రదీప్!” అంటూ అరుస్తూ కొంచెం దూరం కారు వెంట పరిగెత్తాను. విష వలయం
– శారద
(ఛినుకు మాస పత్రిక, జూన్ 2008)
దబ్బుమని కార్లోనించి కిందికి పడ్డాను. కోపంగా లేచి నిలబడి, “ఆగరా ప్రదీప్!” అంటూ అరుస్తూ కొంచెం దూరం కారు వెంట పరిగెత్తాను. కారు ఆగకుండానే వెళ్లి పోయింది. చుట్టూ చూసాను. బస్టాపులో జనం నా వంకే వింతగా చూస్తున్నారు. అదేదో చిన్న జోకులా, ఏమీ ఫరవాలేదన్నట్టు కులాసాగా నవ్వబోయాను. ఏడుపొచ్చి పెదిమలు వాటంతటవే వంకరలు పోయాయి. ఎంత ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆగడం లేదు. దగ్గరలోనే వున్న పార్కులోకి నడిచి బెంచీ మీద కూలబడ్డాను. చెట్టంత మగవాణ్ణి, నిస్సహాయంగా ఏడవటం చాలా అవమానంగా అనిపిస్తుంది, కానీ కడుపులో దుఃఖమూ, గుండెల్లో దిగులూ నన్ను కుదిపేస్తున్నాయి. మోకాళ్లలో తల దూర్చి పది నిముషాలు అలాగే ఏడుస్తూ కూర్చున్నాను. కొంచెం సేపయాక సంచీ లోంచి సీసా తీసి మంచి నీళ్లు తాగాను. సాయంత్రం ఆరవుతున్నట్టుంది. ఆకలీ, ఈ రాత్రికి ఎక్కడ పడుకోవటం అనే జోడు సమస్యలని గురించి ఆలోచించాలి. కానీ మనసు సునీల్ గురించి తప్పితే ఏమీ ఆలోచించనంటోంది. తల పగిలిపోతుంది. దీనికంతా సునీల్ గాడే కారణం. సునీల్ ని తలచుకోగానే మళ్లీ పెద్ద పెట్టున ఏడుపొచ్చింది.
కళ్లు తుడుచుకుని నావైపు చూసుకున్నాను. మాసిపోయిన గుడ్డలూ, పెరిగిన గడ్డం, తిండి లేక పీక్కుపోయిన మొహం, చెంపలు లోతుకుపోయి బయటపడ్డ కళ్లూ, తెగిపోయిన చెప్పులూ, బహుశా బూచాళ్లాగున్నానేమో! నేనేనా? చిన్నప్పుడు నా పై తరగతి పిల్లలకి కూడా లెక్కలు చెప్తూ, చదువులో ఆటల్లో అన్నిట్లో ముందుంటూ, చురుగ్గా టీచర్లందరి ప్రేమకీ పాత్రుణ్ణయిన నేనేనా? లేక చచ్చిపోయి మళ్లీ వేరే జన్మలో వున్నానా?
“నీ డ్రస్సూ, నవ్వూ, చురుగ్గా చూసే చూపులూ, హీరో లాగున్నావురా,” ఆరాధనగా అనే సునీల్ మాటలు గుర్తొచ్చాయి. నిన్న సాయంత్రం ప్రదీప్ వాళ్లింట్లో పార్టీలో ఒంటరిగా పడి వున్నానని తెలిసి నాకోసం పరిగెత్తుకొచ్చిన నేస్తం! రాత్రంతా నా పక్కనే కూర్చోని నాకు హితబోధ చేసిన గురువు.
“ఎలాగైనా నీ పధ్ధతి మార్చుకోరా! ఇంట్లో అమ్మా నాన్నా, చెల్లీ అందరూ ఎంత బాధ పడుతున్నారో అర్ధం చేసుకో! నా మాట విని నాతో రా! ఇదేమీ తీర్చలేనంత పెద్ద భయంకరమైన సమస్యేమీ కాదు. నువ్వు మనసు పెట్టాలంతే! ” అని చిలకకి చెప్పినట్టు చెప్పాడు. రాత్రంతా వాడు నిద్రపోయినా నాకు నిద్ర పట్టలేదు. భవిష్యత్తు గురించిన ఆలోచనలఊ, గతాన్ని గురించిన ఙ్ఞాపకాలూ నా మీద చేసిన దాడిలో రాత్రంతా గడిచిపోయింది.
*****************************
ఇద్దరం చిన్నప్పట్నించీ కలిసి చదువుకున్నాం. పోటాపోటీగా ప్రిపేరయి ఐ.ఐ.టీ ఎంట్రన్సు పరీక్షలో నెగ్గి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినంత సంతోష పడ్డాము. మద్రాసు నగరంలో చదువుకోవటానికెళ్లి ఆ మహా నగరంతో మా పల్లెటూరిని పోల్చుకుని, “ఇక్కడెంత బాగుందిరా!” అనుకున్నాం. ఇద్దరం ఒకే హాస్టలులో వుండలేమని తెలిసి వాడు ఏడుపు మొహం పెట్టాడు గానీ, నేను ధైర్యం చెప్పాను. “జన్మంతా నీ చేయి పట్టుకోని నడిపించడం నా వల్ల కాదురా! ఇండిపెండెంటుగా వుండటం నేర్చుకో” అన్నాను గొప్పగా. నిజానికి చేయి పట్టుకుని తీసికెళ్లాల్సిన అవసరం నాకే గాని వాడీకి లేదన్న విషయం నాకు చాలా కాలం తరువాత గానీ అర్ధం కాలేదు. అప్పటికే జారుడు బల్లమీద నా జీవితం అదుపు తప్పి పోవటం మొదలైంది.
మొదటిసారి థర్డియర్లో సునిల్ ని అడిగాను, “ప్రదీప్ వాళ్ల రూం లో పార్టీ వుంది రమ్మంటున్నారు, వెళ్దామా?” అని. “వద్దురా, ఆ గుంపెందుకో నాకు నచ్చదు,” నేననుకున్నట్టే అన్నాడు. మనసులో ఏదో ఒక బలహీనతని జయించలేక వాడికి చెప్పకుండా ప్రదీప్ రూంకి వెళ్లాను ఆ రాత్రి. అలా వెళ్లకుండా వుండి వుంటే ఈ పాటికి నా బ్రతుకిలా అయివుండేదా?
పార్టీ చాలా రాత్రి వరకు బాగానే వుంది. వాళ్లు ఎంత బలవంతం చేసినా నేను బీరు తాగలేదు, మొండిగా కోక్ బాటిల్ పట్టుకుని కూర్చున్నాను. ఆఖరి సారి అందరికీ మళ్లీ కోక్ వచ్చింది. ఇంకొక కోక్ కేన్ అందుకున్నాను. అందరూ తలా ఒకటి తీసుకుని, “ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం” అన్నారు. నాకర్ధం కాలేదు. గెలుపేమిటి?ఆటేమీ ఆడటంలేదు కదా? జంకుగా, బిడియంగా, నా పక్కనేవున్నా రాజునడిగాను. పెద్దగా నవ్వాడు. “ఆ కోక్ తాగు, ఆటేమిటో నీకే తెలుస్తుంది,” అన్నాడు ప్రదీప్. రోషంగా కోక్ నోట్లో పోసుకున్నాను. అందరూ కోక్ తాగేరు. మామూలుగానే వుంది. నేను భయపడ్డట్టు అందులో డ్రింకులేవీ కలపలేదు. కొంచెం సేపయాక కళ్లు తిరుగుతున్నట్టనిపించి కోక్ కేన్ టేబిల్ మీద పెట్టాను. అందరూ నా వంకే కుతూహలంగా చూస్తున్నట్టనిపించింది.
ఎందుకని అడగబోయాను. నోట్లోంచి మాట రాలేదు. పెద్దగా నవ్వటం మొదలుపెట్టాను. కళ్ల ముందు రంగు రంగులు వలయాలు తిరుగుతున్నట్టూ, ఇంద్ర ధనుస్సు మీదికి ఎక్కుతున్నాట్టూ, చాల బాగుంది. ఇంత మనసారా నవ్వి ఎంతకాలమైందో! ఎవరేం జోకు చెప్పుతున్నారో అర్ధం కావటం లేదు. అయినా పగలబడి నవ్వుతున్నాము అందరమూ, ఎందుకో మరి!
మర్నాడు ప్రదీప్ వచ్చి, “ఎలా వుంది ఇవాళ? రాత్రి పార్టి నీకు నచ్చిందా?” అన్నాడు. “పార్టీ సరే గాని, అదేదో ఆట అన్నావు, ఆడనేలేదే?” అడిగాను నిద్ర మత్తులోనే.
“ఆడకపోవటమేమిటి? ఆడేము, నువ్వే గెలిచావు కదా?” “నేను గెలిచానా? నాకు గుర్తు రావటం లేదే” అయోమయంగా అడిగాను. “వెర్రి నాయనా! రాత్రి మనం ఆడింది కొత్త రకం ఆట. అన్ని కోక్ బాటిల్సూ ఒకే లాగున్నా, అందులో ఒక్క దానిలొ మారివానా కలిపాను. ఎవరికి మారివానా కలిపిన బాటిల్ వస్తే వాళ్లు గెలిచినట్టు. రాత్రి అందుకే నువ్వలా రెచ్చిపోయావు. ఎలా వుంది మొదటి సారి, కొత్త రకం కోక్? స్వర్గం లో విహరిస్తున్నాట్తు అనిపించలేదూ?” ఒక్క క్షణం మనసు భయం తో మొద్దుబారి పోయినట్టయింది. నేను డ్రగ్స్ తీసుకున్నానా? ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అమ్మా నాన్నా గుండె ఆగి చచ్చిపోతారు. ఇంకెప్పుడూ ఈ ప్రదీప్ గేంగ్ తో మాట్లాడొద్దు. లేచి పరిగెత్తుకుని సునీల్ దగ్గరకెళ్లి సంగతంతా చెప్పాను.
జరిగిందంతా విని సునీల్ ఏమీ అనలేదు. నాలుగు రోజులు నన్ను అంటి పెట్టుకునే వున్నాడు. రెండు నెలల తరువాత వాళ్ల అక్కయ్య పెళ్లికి వెళ్తూ నన్నూ రమ్మన్నాడు. ఊరికే క్లాసులు పోతాయన్న భయంతో వద్దన్నాను. ఒంటరితనం, పరీక్షల టెన్షన్, మానసిక బలహీనత అన్నీ నన్ను మళ్లీ ప్రదీప్ వైపు తోసాయి. సునీల్ ఇంటినించి వచ్చింతరువాత వాడికేమీ చెప్పలేదు. వాడే ఆరునెలల్లో కనిపెట్టాడు. అప్పటికి ఫైనల్ ఇయర్లోకి వచ్చాము.
“వద్దురా! ఆ డ్రగ్స్ జోలికి వెళ్లి ఆరోగ్యమూ భవిష్యత్తూ అన్నీ పాడు చేసుకుంటున్నావు.” ఎన్నో సార్లు చెప్పాడు సునీల్. నా హాస్టల్ రూం తన పక్కకే మార్పించుకున్ని నన్ను పగలూ రాత్రి వెన్నంటి వున్నాడు. వాడిదేం తప్పు లేదు. వాడు నా కోసం చేయగలిగిందంతా చేసాడు. నేనే, మంచీ చెడూ విచక్షణ పోగొట్టుకోన్న్నాను. మారాలనే ఆశా, ఆసక్తీ నాకు లేనప్పుడు ఎంత మంది ఎన్ని విధాల చెప్పినా లాభం లేదు. నా మొహం చూసి వాడు మా ఇంట్లో ఈ సంగతులేవీ చెప్పలేదు. ఆఖరి సెమిస్టరు అన్ని సబ్జెక్టులూ ఫెయిల్ అయిన సంగతి కూడా. వాడు చదువు పూర్తి చేసుకునీ, నేను చదువు వదిలేసుకునీ కేంపస్ నించి బయట పడ్డాము.
*************************
నెల రోజులలో నా పరిస్థితి అర్ధం చేసుకున్న మా నాన్న గారు సునీల్ ఇంటికెళ్లి వాణ్ణి చెంప పగలగొట్టారు.
“నా తప్పే అంకుల్! నేనే ఇంకా వాణ్ణి ఎక్కువగా కనిపెట్టి వుండాల్సింది” అని బాధ పడ్డాడు. ఆరు నెలలు నా కోసం అహో రాత్రులూ ఎక్కడెక్కడివో డీ-అడిక్షన్ కార్యక్రమాల వివరాలు తెచ్చాడు. నా బలహీనత జయించాలన్న ప్రయత్నం నా వైపు నించి ఏమీ లేకపోగా, నాకు మత్తు మందులకొరకు డబ్బు కోసం నేను స్కూలు పిల్లలకు మత్తు మందులు అమ్మటం మొదలు పెట్టాను. ఆ సంగతి తెలిసినప్పుడు మాత్రం మొదటిసారి నా మీద చేయి చేసుకున్నాడు సునీల్.
“దరిద్రుడా! నీకు పట్టిన పీడ అందరికీ పట్టిస్తున్నావా! దీనికంటే నువ్వు చస్తేనే మా కందరికీ శాంతి,” అన్నాడు.
ఆ తరువాత మరి రెండు నెలలు వాడు నా మొహం చూడలేదు. నేను పూర్తుగా మత్తు మందులకీ, వాటికోసం ప్రదీప్ కీ బానిసనయిపోయాను. స్కూలు పిల్లలని చూస్తే మాత్రం సునీల్ కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి చెంప చురుక్కుమంటుంది.
ఇంటికెళ్తే కుమిలిపోతున్న అమ్మా నాన్నల మొహాలు! వాళ్లకి ధైర్యం చెప్పి తనే నీరుకారిపోతున్న చెల్లి! అందాల పూల పడవ లాటి మా ఇంటిని ఈ తుఫానులోకి నెట్టింది నేనే అనుకుంటే నాకు చావటానికీ, బ్రతకటానికీ కూడా ధైర్యం చాలటంలేదు. ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాళ్లు నా మీద. పెద్ద చదువులు చదివి ఇంటికీ, వంశానికీ పేరు తెస్తాననీ, సంఘానికుపయోగపడే పనులు నేను చేస్తుంటే వాళ్లు గర్వ పడాలనీ, నా ప్రేమా ఆప్యాయతల నీడలో చల్లగా సేద దీరాలనీ, ఎన్ని కలలు కన్నారో, పాపం ఆ పిచ్చి వాళ్లు. ఆ కలలన్నిటి మీదా నీళ్లు చల్లి వాళ్ల కడుపుల్లో ఆరని మంట పెట్టాను నేనే!
ఇలా అనుకున్నప్పుడు ఎలాగైనా ఆ మాదక ద్రవ్యాల మత్తులో నించి బయట పడాలని అనిపించేది. కానీ, నన్ను చూస్తే నాకే కలిగే అసహ్యాన్ని తట్టుకోవటానికే నేను మళ్ళీ మళ్ళీ మత్తు మందులని ఆశ్రయించానేమో!
నిన్న రాత్రి ప్రదీప్ పెళ్లి రిసెప్షన్ అని తెలిసి పిలవకపోయినా వెళ్లాను. నన్నూ నా వాలకాన్నీ చూసి అందరూ అసహ్యంగా మొహం పెట్టారు. నన్ను ఒక గదిలో పెట్టి తాళం వేసి, అందరూ వెళ్లాక సునీల్ కి ఫోన్ చేసాడు ప్రదీప్. మాట్లాడకుండా సునీల్ వెనకే వాడి ఇంటికెళ్లాను.
“రేపు నాతో బాటు రాకపోతే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే!” పడుకునేముందు వాడు నాతో అదొక్కటే మాట అన్నాడు. ఆఫీసుకి సెలవు కూడా పెట్టాడు. కానీ పాపం, ఏదో అర్జంటు పనని ఫోనొచ్చింది. “ఎక్కడికీ వెళ్ళకుండా ఇక్కడే వుండు” అని నాతో ఒట్టేయించుకుని వెళ్ళాడు. వుండాలనే అనుకున్నాను. వున్నాను మధ్యాహ్నం రెండింటి వరకూ. కానీ నరాలు తోడేస్తున్నంత బాధ. ఒక్కసారి, ఇంకొక్కసారి తీసుకుంటే, సాయంత్రం డాక్టరు దగ్గరికెళ్లినప్పుడు ఈ బాధకి వేరేదైనా మందు ఆడగొచ్చు! నాకు నేనే నచ్చ చెప్పుకున్నాను. మళ్లీ ప్రదీప్ దగ్గరకెళ్లాను.
వాడు “నాతో రా!” అని కార్లో తీసుకెళ్తూ దారిలో నన్ను కార్లోంచి తోసి వెళ్లిపోయాడు. ఇప్పుడు నాకు సునీలూ వద్దూ, వాడి స్నేహమూ వద్దు. మత్తు మందు, ఒక్క చిన్న డోసైనా చాలు. అ మత్తులో నా కళ్ల ముందు రంగు రంగుల్తో తిరుగాడే వలయాలు, ఎంత అందంగా వుంటాయవి. ఆ వలయాలు చూస్తుంటే ఎంతటి శాంతి, ఎంతటి వుత్సాహం, ఎంత సంతోషం! వాటినందరూ విష వలయాలంటారెందుకో! ఈ వలయంలోంచి నేనెప్పుడైనా బయట పడతానా? ఏమో మరి!
*****************************
జూన్ 10, 2008 వద్ద 12:20 అపరాహ్నం
మంచి కథాంశం తీసుకున్నారు శారదా. నిజంగా విషవిలయమే. ఎటొచ్చీ అదే నాగరికతగా చెలామణి అవుతోంది. మీలా ఆలోచించినవాళ్లని అమాయకులు అంటారు.
అభినందనలు.