నీలాంబరి

నేనెవరిని?

Posted by: sbmurali2007 on: జూన్ 10, 2008

ఏడున్నరైపోయింది. చంటిదాన్ని రెడీ చేసి బేబీ కేర్ సెంటర్లో దిగబెట్టాలి. రాహుల్ ని తయారు చేసి స్కూల్లో దింపాలి. ఈయన స్నానమూ, షేవింగూ ఇప్పట్లో అయేటట్టు లేవు.                                                              నేనెవరిని?
                                                                                    -శారద
(ఆంధ్ర భూమి దినపత్రిక జూన్ 7, 2008

మార్చి 8 2007
——————
ఉ|| 7.35


ఓరి దేవుడోయ్! ఏడున్నరైపోయింది. చంటిదాన్ని రెడీ చేసి బేబీ కేర్ సెంటర్లో దిగబెట్టాలి. రాహుల్ ని తయారు చేసి స్కూల్లో దింపాలి. ఈయన స్నానమూ, షేవింగూ ఇప్పట్లో అయేటట్టు లేవు. ఈ వంటింట్లోంచి బయటపడటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఇవాళ తొమ్మిదిన్నరకల్లా మీటింగుకొస్తానని ఆఫీసులో చెప్పాను. లేటయిందంటే ఆ రాఘవన్ రామరాజన్, “ఆడవాళ్ళంతా ఎప్పుడూ లేటే” అన్నట్టు ఒక అసహనమైన చూఫు చూస్తాడు. అసలే ప్రమోషన్ కోసం పోటీ! పైగా మొన్న వాటర్ కూలర్ దగ్గర, నేను వెళ్తుంటే కావాలని పెద్దగా “మనం చీరలో, లేక చుడీదార్లో వేసుకోలేం కదా, అందంగా నవ్వలేం కదా, మరి మనకి ప్రమోషన్ లెలా వస్తాయి, మన బొంద!” అంటూ వుంటే గుంపంతా ఆనందంగా పడీ పడీ నవ్వారు. చెంపలు పగులగొట్టాలన్నంత కోపం వచ్చినా, తమాయించుకున్నాను. ఇవాళ ప్రాణం పోయినా మీటింగుకి ముందే వెళ్ళాలి.
“అమ్మా! ఇవాళ స్కూల్లో కేక్ తీసుకొస్తానని చెప్పాను,” గుమ్మంలో రాహుల్ కళ్ళు నులుముకుంటూ నిలబడ్డాడు. గుండె గుభిల్లుమంది. కేలండార్లో రాసి పెట్టుకుంది. ఎలా మరిచిపోయింది! సరే ఏదో చేయాలి. వాణ్ణెత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, బాత్రూంలో కెళ్ళాను.
అబ్బ! ఇవాళ అదృష్టం బాగుంది. వినయ్ “నేను బేకరీ కెళ్ళి కేకు కొనుక్కొస్తాలే, నువ్వు మిగతా పని చూసుకో” అన్నాడు.

ఉ|| 8.30


రాహుల్ ని స్కూల్ గేట్ దగ్గర దింపి బయటికొస్తున్నాను. మిసెస్ ప్రకాష్, ఆమె పేరేమిటో ఎప్పుడూ గుర్తు రాదు, కనబడనే కనిపించింది. ఎంత తప్పించుకుందామన్నా ఎలాగో నన్ను చూసి దగ్గరకొస్తుంది ఎందుకో. అక్కడికీ తొందరలో వున్నానని సైగ చేసి వెళ్ళే ప్రయత్నం చేసాను.
“ఏమిటీ, ఇవాళ కేకు మరిచిపోయారా?” ఆనందంగా నవ్వుతూ అంది. ఒళ్ళు మండి పోయింది.
” లేదు, పెద్ద చాక్లేట్ కేకు కొని ఇచ్చాను,” అన్నాక గానీ పప్పులో కాలేసానని అర్ధం కాలేదు.
లిప్ స్టిక్కు వేసుకున్న పెదిమలూ, అందమైన ముక్కూ అన్నీ చిట్లిస్తూ,
“బేకరీ లో కొన్నారా? అది మంచి అలవాటు కాదు తెలుసా! ఇంట్లో చేయాలి. మా పిల్లలైతే నువ్వు చేసిన కేక్ లాగుండదు మమ్మీ, అంటూ వుంటారు. వాళ్ళ తిండీ తిప్పలు కుదరవని నేను ఉద్యోగం మానేసాను. కొంచెం ఆడవాళ్ళం కేరీరూ, డబ్బూ, ఆఫీసూ అంటూ పరుగులు పెట్టక పోతే ఇంట్లో ఎంత సుఖమూ, శాంతీ..” నాకు ఆమె మాటలకన్నా, అవి చెప్తూ ఆమే ముఖంలో వుండే ఒక రకమైన పవిత్రమైన భావన, ఎలకని మింగిన పిల్లి మొహం మీద వుండేటటువంటి నవ్వూ చూస్తే ఒంటికి కారం రాసుకున్నంత మంట పుడూతుంది. ఏదో ఒక చురక తగిలించకపోతే రాత్రికి నిద్ర పట్టాదు.
“మీ పిల్లలు మిమ్మల్ని మమ్మీ అని పిలుస్తారా? నాకు మా పిల్లలు అమ్మా అనకుండా మమ్మీ అంటే తిన్నదంతా వాంతి అయిపోయేంత అసహ్యం వేస్తుంది. వస్తాను, ఆఫీసుకి లేటవుతుంది,” ఆవిడ తేరుకునే లోగానే పారిపోయాను.
కారు నడుపుతున్నా ఒక రకమైన అపరాధ భావన. క్లాసులో పిల్లలందరూ రాహుల్ ని వెక్కిరిస్తారేమో! మీ అమ్మ షాపులో కొన్న కేకు ఇచ్చిందే అని. అందరు తల్లులకీ ఇళ్ళ దగ్గర బోలెడు టైం వుంటుందా? ఈ సారి సగం రోజు సెలవు పెట్టైనా ఇంట్లో చేసిన కేకో, స్వీటో పంపించాలి. అంతే కాదు, వీలైతే స్కూల్లో ఏదైనా ప్రోగ్రాంలో వాలంటీర్ గా పనిచేయాలి. ప్రతీ సారీ అనుకోవటమే కానీ ఏదో అడ్డంకి. క్రిందటి సంవత్సరం నాలుగు రోజులు సెలవు దాచుకున్నాను రాహుల్ తో గడపాలని. చంటి దానికి జ్వరం ముంచుకొచ్చి నాలుగు రోజుల సెలవూ ఖర్చయిపోయింది.

ఉ|| 9.30


అమ్మయ్య! పడుతూ లేస్తూ మీటింగుకి టైముకొచ్చాను. రాఘవన్ నన్ను చూసి గడియారం చూసుకుని లేని ఆశ్చర్యం నటించాడు. నేను వీలైనంత భావరహితంగా మొహం పెట్టాను.
‘కొత్త న్యూ సైంటిస్టులో న్యూరొలొజీ మీద మంచి వ్యాసం వచ్చింది,చదివారా?” నవ్వుతూ అడిగాడు. ఆ వెటకారపు నవ్వుకీ, ఆ ప్రశ్నకీ అర్థం నాకు బాగా తెలుసు. ఆడవాళ్ళకి ప్రొఫెషన్ మీద ఏ మాత్రం శ్రధ్ధ వుండదనీ, ఏదో కాలక్షేపం కోసం ఉద్యోగాలు చేస్తారే కానీ వాళ్ళ దృష్టి అంతా భర్తా, ఇల్లూ పిల్లల మీదా వుంటుందనీ, చీరలూ, నగలంటే ఎక్కువ వ్యామోహం వుంటుందనీ అతనికి కొన్ని అమూల్యమైన అభిప్రాయాలున్నాయి. ఈ చెత్త అభిప్రాయాలని పక్కన పెడితే అతను సైంటిస్టుగా చాలా తెలివైన వాడు. అతనితో పోటీ పడటం వల్లే నేను నా ఫీల్డులో ఎంతో ఙ్ఞానాన్నీ, పేరునీ సంపాదించుకుంటున్నాను. క్రమం తప్పకుండా అతనికంటే కనీసం ఒక్కటైనా నా పేపరు ఎక్కువ వుండేటట్టు చూసుకుంటాను. కానీ పిల్లల బాధ్యతతో ఎక్కువగా కాన్ఫరెన్సులకి వెళ్ళలేను. వాళ్ళని వదిలి వెళ్ళాలనిపించదు. అందుకే అతనికి ఎక్కువ పరిచయాలుండటంతో పాటు ఎక్కువగా గ్రాంటులు కూడా వస్తూ వుంటాయి. దానికి నేనేమీ ఉడుక్కోను కూడా.
అతనే కావాలని నన్ను అడ్డమైన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతూ వుంటాడు. అయితే ఈ సారి నేను తయారుగా వున్నాను.
“ఆ వ్యాసం నేను చదివి చాలా రోజులయింది. చదవటమే కాదు, దాని మీద లెటర్స్ టు ది ఎడిటర్ కి నా వ్యాఖ్య కూడా పంపించాను. వచ్చే ఇష్యూలో వేస్తుండవచ్చు,” చాలా కాజువల్ గా అన్నాను. ఒక్క నిమిషం అతను చిన్నబోయాడు. అతని భార్య చాళా పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ అని విన్నాను. ఇతని ఔట్ డేటెడ్ అభిప్రాయాలని ఎలా తట్టుకుంటుందో పాపం!
మీటింగ్ ముగిసి వెళ్ళేటప్పుడు, మళ్ళీ నెల మీటింగ్ ఎప్పుడు అనే విషయం చర్చ కి వచ్చింది. నేను ఈ సారి నాలుగో తారీఖు మధ్యాన్నం మూడు గంటలకి సజెస్ట్ చేసాను. రాఘవన్ వెంటనే, “మూడు గంటలకి నాకు కుదరదు. మా బాబు స్కూల్ లో ఆ రోజు స్పెషల్ ప్రోగ్రాం వుంది. నేను వెళ్ళాలి,” అన్నాడు.
అందరూ అతని వంక చిరు నవ్వుతో అబ్బురంగా చూసారు. ఇంత పెద్ద సైంటిస్టయినా, ఇల్లూ కుటుంబం, పిల్లల మీదా యెంత ప్రేమా, యెంత శ్రధ్ధా అన్నట్టుగా. చైర్ మేన్, “అఫ్ కోర్స్! ఫేమిలీ ముఖ్యం. అందులో ఇలాటి ప్రత్యేక కార్యక్రమాలల్లో కి అమ్మే కాదు, నాన్న కూడా కావాలి పిల్లలకి.  గో అహెడ్ ఎండ్ ఎంజాయ్. మీటింగ్ పొద్దున్న పది గంటలకి పెడదాం.” అందరూ లేవటానికి వెళ్ళారు. అయోమయంగా చూసాను. అదే నేను పిల్లలకి జ్వరంగా వుందనో, వంట్లో బాగా లేదనో అంటే నా వంక అసహనంగా చూస్తారు, ఈ ఆడవాళ్ళంతా ఇంతే అన్నట్టు.
ఒక్క క్షణం మళ్ళీ ఆలోచించాను. నిజంగా వాళ్ళలా అనుకుంటారా లేక ప్రతీ దానికి గిల్టీ గా బాధపడటం అలవాటయి నేనే అనుకుంటున్నానా? కావచ్చు. ఈసారి నేనూ  ఏదో తప్పు చేస్తునట్టు కాకుండా మామూలుగా చెప్పాలి, రాఘవన్ చెప్పినట్టు.
పోటీ, పోటీ, స్కూల్ లో మిసెస్ ప్రకాష్ తో పోటీ, ఆఫీసులో రాఘవన్ తో పోటీ. కానీ రెండు పోటీల్లోనూ నేనే ఓడిపోతున్నానిపిస్తుంది. ఈ పోటీలన్నీ వదిలేసి హాYఇగా వుండాలి.

మ|| 12.30
ఆఫీసు కిచెన్లో కూర్చుని పుస్తకం చదువుతూ లంచ్ తింటూ వుంటే టైపిస్టు ఉమ వచ్చింది.
“హల్లో మేడం ! బాగున్నారా?” అంటూ.
పుస్తకం పక్కన పడేసి కబుర్లలో పడ్డాము.
“ఏమిటి సంగతులు ఉమా? సినిమాలేమైనా చూసావా?”
“సినిమాలా? నా బొంద! టైమెక్కడుంది మేడం? పొద్దున నాలుగున్నరకి లేచానంటే మళ్ళీ రాత్రి తొమ్మిదింటి వరకూ నడుం లేపకుండా చాకిరి.”
నిజమే! పాపం ఉమ అత్త మామలతోటి పెద్ద ఉమ్మడి కుటుంబంలో వుంటూంది. పిల్లలతో పాటు పెద్ద వాళ్ళనీ చూసుకోవాలి. పోనీ ఉద్యోగం మానేద్దామంటే, భర్తది చాలీ చాలని సంపాదన.
“నాకు తీరిక లేని పనితో పెద్ద బాధేమీ వుండదు మేడం. కానీ బస్సుల్లో మగ వాళ్ళు మీద మీద పడి తోస్తూ, అందిన చోటల్లా తాకుతూ, వేసే వెకిలి వేషాల వల్లే మనసంతా పాడవుతుంది. ఇళ్ళల్లో పెళ్ళాలు వున్నా కూడా మగవాళ్ళకి పరాయి ఆడ దాన్ని ముట్టుకుంటే వచ్చే ఆనందమేమిటో నాకస్సలే అర్ధం కాదు.”  నిజమే!చిన్నప్పుడు  కాలేజి కెళ్ళే బస్సులో  భుజం మీద చేయి వేస్తూ “టికెట్ టికెట్” అంటూ అడిగే కండక్టరునీ, పొరపాటున వెనక్కి వచ్చిన ఆడపిల్లలని ఒళ్ళాంతా తడుముతూ నిలబడే వెధవలనీ తలుచుకుంటే ఉరి తీయాలన్నంత కోపం వస్తుంది.  ఆ సంగతే అన్నాను.
“హయ్యో! మనం చదువుకున్న రోజుల్లో పరిస్థితే నయం, మేడం. ఇప్పుడు కాలేజీ ఆడపిల్లలని అడ్డమైన గాడిదలూ ప్రేమించమని వెంట పడతారు. కాస్త చదువూ, సంస్కారం, సభ్యతా వున్న ఆడపిల్ల నిరాకరిస్తే ఏకంగా నరికేయటమే!” అవును! పేపరులో చదివే వార్తలు గుర్తొస్తే ఒళ్ళు జలదరిస్తుంది.

సా|| 6.00


చంటి దాన్నీ, రాహుల్ నీ తీసుకుని పార్కు కొచ్చి కూర్చుంటే ఎంత బాగుందో.  ఆఫీసు వాళ్ళు నాకిచ్చిన స్టాఫ్ క్వార్టర్స్ లోనే వుండటం నేను చేసుకున్న అదృష్టం. సిటీ లో వుండే ఉద్యోగస్తుల్లా గంటలు గంటలు ప్రయాణాల బాధ వుండదు. పాప “అమ్మ, అమ్మ” అని పిలుస్తుంటే, రాహుల్, “అమ్మా! చెల్లి నవ్వుతోందే” అంటూ వుంటే నాకు వెన్నెల్లో కూర్చున్నంత హాయిగా వుంది. వీళ్ళ నవ్వులూ, ముద్దులూ, ముచ్చట్ల కోసం కొంచెం ప్రొఫెషన్ లో వెనక బడితే మాత్రం ఏముంది? వీళ్ళ అందమైన చిన్నతనం, ముద్దు మాటలూ మళ్ళీ రావుగా అనిపిస్తుంది. అందుకే ఎన్ని పేపర్లు పబ్లిష్ చేసినా, ప్రయాణాలు మాత్రం పెట్టుకోను.
సెల్ ఫోను మోగింది. వినయ్!
“హల్లో స్వీట్ హార్ట్!”. అంటే ఎవరినో భోజనానికి వెంట పెట్టుకొస్తున్నాడన్న మాట.
అనుకున్నట్టుగానే చెప్పాడు. “మా ఆఫీసులో కొత్తగా తెలుగు వాళ్ళ కుటుంబం వచ్చింది. రాత్రికి భోజనానికి రమ్మన్నాను. వంట గురించి దిగులేం పెట్టుకోకు. ఇద్దరం కలిసి చేసేద్దాం.”
అవునవును. ఇద్దరం కలిసే చేస్తాం. అతనికీ తెలుసు అవన్నీ వట్టి మాటలేనని.
ఇదొక్కటే ఇతని బలహీనత. తెలుగు మాట వినబడగానే భోజనానికి పిలుస్తాడు.
ఇంటికెళ్ళి, గబ గబా తిండి తిని ఎనిమిదిన్నరకల్లా పక్క ఎక్కాలనుకున్నాను. అలా అయేటట్టు లేదు.

పిల్లల్ని తీసుకుని ఇంటి కెళ్ళాను. ఇంటికెవరన్నా వస్తున్నారంటే ఇల్లు కొంచెమైనా శుభ్రంగా వుంచాలనిపిస్తుంది. లేకపోతే, “అబ్బో! పెద్ద సైంటిస్టట. ఇల్లు సర్దుకోవటం చేత కాదేమో,” అని అనుకుంటారేమో నని భయం.
గబ గబా ఇల్లు కొంచెం శుభ్రం చేసి, పొద్దున చేసిన వంట ఫ్రిజ్ లో పడేసి మళ్ళీ వంట చేసాను. వినయ్ స్నేహితులని తీసుకుని వచ్చేసరికి నా స్నానం కూడా పూర్తయింది. ఇంటినీ, నన్నూ, వంటింట్లోంచి వస్తున్న వాసనలనీ చూసి వచ్చిన వాళ్ళ మొహంలో అభినందన, వినయ్ మొహంలో గర్వం, నాకు తృప్తి!

రా|| 9.30
నిద్రొస్తున్నా, కాసేపు వార్తలు చూద్దామని టీవీ పెట్టాను. వినయ్ స్నేహితులని వాళ్ళ హోటల్లో దిగబెట్టటానికి వెళ్ళాడు. పిల్లలిద్దరూ నిద్ర పోతూ వుండటంతో ఇల్లంతా ప్రశాంతంగా వుంది. ఇవాళ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అట.  టీవీ లో ఏదో స్పెషల్ ప్రోగ్రాం వస్తుంది. కుతూహలంగా వాల్యూం పెంచాను.
ఒక అందాల సుందరినీ, ఒక బ్యూటీషియన్ నీ, ఒక సినిమా తారనీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. భారతీయ స్త్రీ అంటే ఏమిటీ అని ఇంగ్లీషులో అందంగా నవ్వుతూ వివరిస్తుంది ఆ మిస్ ఇండియా.  మగవాళ్ళకిష్టమైన కొలతల్లో వుండటానికి అష్ట కష్టాలు పడుతూ, ఆ మగవాళ్ళకి తమ శరీరాల్ని చూపించి ఊరిస్తూ డబ్బు సంపాదించే  వీళ్ళా నాకు స్త్రీత్వం గురించి చెప్పేది, అని చిరాకెత్తింది. పొద్దస్తమానూ ఇంటిల్లిపాదికీ అన్నీ అమర్చి పెడుతూ, మళ్ళీ నాలుగు రాళ్ళ కోసం మగవాళ్ళ వెకిలి వేషాలన్నిటినీ తట్టుకుంటూ ఉద్యోగాలు చేసుకునే ఉమ లాటి ఆడవాళ్ళనీ పిలవరు. అత్యాధునికమైన శాస్త్రీయ, సాంకేతిక విభాగాల్లో పని చేస్తూ కూడా, మగవాళ్ళతో పోటీలో వెనక బడుతున్న నాలాటి సైంటిస్టులనీ, ఇంజనీర్లనీ పిలవరు. ఇల్లూ వాకిలీ, కుటుంబమూ చూసుకుంటూ కూడా, అర్ధరాత్రైనా వైద్య సహాయం అందించే లేడీ డాక్టర్లనీ పిలవరు కానీ  టీవీ వాళ్ళు ఇలాటి కార్యక్రమాలకి ఈ సినిమా తారలనీ, అందగత్తెలనీ పిలుస్తారెందుకో.
కోపంగా టీవీ ఆఫ్ చేసి పడుకున్నాను.

రా|| 11.00
ఫోన్ గణ గణా మోగుతోంది. ఇంత రాత్రప్పుడు ఎవరబ్బా?
“స్వర్ణా, పడుకున్నారా?” మా మావగారి గొంతు.
“ఇప్పుడే పడుకున్నాం మావయ్యా! వినయ్ ని లేపనా?”
“వద్దులే! వాడు చాలా అలిసిపోయి వుంటాడు. పడుకోనీ.”
ఉన్నట్టుండి నాకు ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం వచ్చింది. అన్ని భావాల్లాగే దీన్నీ తమాయించుకున్నాను.
“చెప్పండి, ఇంత రాత్రప్పుడు ఫోన్ చేసారు?”
మనుషుల నించి లాజిక్కూ, న్యాయమూ ఆశించటం మానేసి చాలా యేళ్ళయింది.  స్వంత అత్తా మామల దగ్గర్నించయినా. పొద్దున్నే లేచి, షేవింగూ, స్నానమూ చేసి, ఆఫీసుకెళ్ళి వచ్చి, అన్నం తిని పడుకునే వాళ్ళ కొడుకేమో అలిసిపోతాడు. ఇంటి పనీ, వంట పనీ, పిల్లల పనీ, ఆఫీసులో పనీ, అన్నీ చూసుకుని కూడా రాత్రి పదకొండింటికి నేనూ అలిసిపోతానని వీళ్ళ కెందుకనిపించదు. కొన్ని విషయాలను మనసుకి పట్టించుకోవటమంత వ్యర్థం ఇంకోటి వుండదు.
ఇంతకీ ఆయనక్కావల్సింది ఏవో బాంకు అక్కవుంటు వివరాలు. పొద్దునే వినయ్ కి చెప్తానని చెప్పి పడుకున్నాను.

రా|| 12.00
నిద్ర పట్టటం లేదు. మళ్ళీ పొద్దున్నే అయిదింటికి లేవాలి. కళ్ళు గట్టిగా మూసుకుని ప్రయత్నించాను.

ఇంతకీ నేనెవర్ని? తల్లినా, భార్యనా, కోడలినా, సైంటిస్టునా? ఎవరు నేను?
ఇంకొక గంట దాకా నిద్ర పట్టదేమో అనిపించింది.
లేచి ఫోన్ డయల్ చేసాను.
“నాన్నా! ఇంత రాత్రప్పుడు ఫోన్ చేసావు? నిద్ర రావటం లేదా?” నాన్న గొంతు ఫోన్లో ప్రేమగా వినపడుతుంది. ఫోన్లో కాసేపు కబుర్లు చెప్పి పెట్టేసాను.  నాకు తెలిసింది నేనెవ్వరో ! చంటిదాన్ని దగ్గరికి లాక్కుని హత్తుకుని పడుకున్నాను. అయిదు నిమిషాల్లో నిద్ర పట్టేసింది.

                                          *************************************

 

 

 

1 స్పందన కు "నేనెవరిని?"

ప్రత్యుత్తరమిమ్ము